Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీని ‘సౌత్ బీహార్’గా మారుస్తున్నారు: టీడీపీ, వైసీపీలపై షర్మిల ఫైర్

YS Sharmila Criticizes TDP and YSRCP Over Election Violence in Andhra Pradesh
Advertisement
  • టీడీపీ, వైసీపీలది ప్రతీకార రాజకీయమన్న షర్మిల
  • స్థానిక ఎన్నికల్లో హింసపై తీవ్ర స్థాయిలో విమర్శలు
  • ఎన్నికల సంఘం, పోలీసుల తీరుపై ప్రశ్నలు
  • స్వేచ్ఛాయుత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
Advertisement
టీడీపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు దాష్టీక రాజకీయాలు చేస్తూ, ప్రతీకారాలతో రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నాయని ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను మరో ‘సౌత్ బీహార్’గా మార్చే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాయచోటి, పుంగనూరులో జరిగిన ఘర్షణలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఆందోళనకరమైన పరిణామాలని షర్మిల అన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను ఘర్షణలు, దాడులతో రణరంగంగా మారుస్తున్నారని విమర్శించారు. "కూటమిది నిజంగా పవిత్ర పాలనే అయితే దాడులు ఎందుకు? బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు? నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమెందుకు?" అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. నాడు వైసీపీ హయాంలో హింసాకాండ జరిగితే, నేడు టీడీపీ హయాంలో అంతకుమించిన ఘోరాలు జరుగుతున్నాయని ఆమె పోల్చారు.

నామినేషన్ కేంద్రాల వద్ద గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని, శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని షర్మిల నిలదీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ సాగిస్తున్న ఈ దౌర్జన్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు రాజకీయాలకు, రక్తపాతానికి తావులేదని, అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆమె పలు డిమాండ్లు చేశారు. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నామినేషన్ వేసేలా చూడాలని, బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ కావాలి కానీ, పగలు ప్రతీకారాలకు వేదిక కాకూడదని ఆమె పేర్కొన్నారు.


Advertisement
Advertisement
YS Sharmila
AP Local Body Elections
Andhra Pradesh Politics
TDP YSRCP Violence
AP Congress President
South Bihar Comparison

More Telugu News